కార్మిక చట్టాల సవరణ ఎవరి ప్రయోజనాల కోసం?*కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్‌కు వత్తాసు పలుకుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాలకు సవరణలు చేసింది. కార్మికుల హక్కులకు నష్టం కలిగించడంలో వీరిద్దరిదీ ఒకే వైఖరి అని మరో సారి తేటతెల్లమైంది. అనేక సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలకు తూట్లు పొడుస్తూ పాలకులు ఈ విధానాలు తెచ్చారు. యజమానులు తమ వ్యాపారాలను తేలిగ్గా చేసుకునేందుకు ఈ మార్పులు తెస్తున్నామని కేంద్ర, రాష్ట్ర పాలకులు నిస్సిగ్గుగా చెబుతున్నాయి. దీనిపై ఇక తేల్చుకోవాల్సింది కార్మిక వర్గమే. పోరాడి సాధించుకున్న చట్టాలను తిరిగి ఐక్య పోరాటాల ద్వారానే నిలబెట్టుకోవాలి. కేంద్ర, రాష్ట్ర పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు, విశ్రాంతి, రాత్రి పూట పని చేయించడం తదితర అంశాల్లో చట్టాలకు తూట్లు పొడుస్తూ మార్పులు చేసింది. ”ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అమలు కోసం, యజమానులు తమ వ్యాపారాలను తేలిగ్గా చేసుకునేందుకు ఈ మార్పులు తెస్తున్నామని ప్రెస్ మీట్‌లో గౌరవ మంత్రివర్యులు ప్రకటించారు. ఈ సవరణలను పరిశ్రమలు, సంస్థలపై ప్రస్తుతం ఉన్న చట్టాల అమలు వల్ల కలిగే విధానపరమైన భారాన్ని తగ్గించడానికేనని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా తమ పెట్టుబడిదారీ వర్గ అనుకూల ధోరణిని బయటపెట్టారు. ఈ మార్పుల వలన రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల్లో పని చేసే 50 లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాలుగా షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్స్‌లో కనీస వేతనాల సవరణ చేయకపోవడం వలన వీరంతా ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. ఈ సవరణల ద్వారా మరింత దోపిడీకి గురవుతారు. ఆ మేరకు యాజమాన్యాలు లాభపడతాయి. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయడం లేదు. వీరెవరికీ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. దాదాపు 50 లక్షల మందిగా ఉన్న భవన నిర్మాణం, హమాలీ, ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు, షాప్ ఎంప్లాయీస్ తదితర అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత సౌకర్యాలు అమలు కావడం లేదు. వీటిని పట్టించుకోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేడు యాజమాన్యాల సౌలభ్యం కోసం ఈ మార్పులు తేవడం సరైనది కాదు. ఎన్నికల ముందు కార్మిక సంక్షేమం, సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడి ఓట్లు వేయించుకున్న తెలుగుదేశ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ మార్పులు తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సంఘాలకు అతీతంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలపాలి.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్ 54ను సవరించి ప్రస్తుతం విరామంతో సహా ఉన్న 9 గంటల పనిని 10 గంటలకు పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలో షాపులకు సంబంధించి సెక్షన్ 9, సంస్థలకు సంబంధించి సెక్షన్ 16ను సవరించి అవసరాన్ని, సీజన్‌ను బట్టి రోజుకు 8 గంటల పనిని 10 గంటల వరకూ పెంచవచ్చన్నారు.వారంలో పని గంటలు 48 గానే యథాతథంగా ఉంటాయని (రోజుకు 8 గంటలు ఞ 6 రోజులు), చెబుతున్నా ఆచరణలో కార్మికుడిపై పని గంటలు, పని భారం పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న రోజుకు 8 గంటల పనిని మార్చే హక్కు ప్రభుత్వానికి లేదు. 8 గంటల పనిని డబుల్ వేతనంతో ఓటి చేయించుకోవాలన్నా కూడా కార్మికుడి రాతపూర్వక ఒప్పందం ఉండాలి. ఇదేదీ లేకుండా రోజువారీ పని గంటల్లో ఏకపక్షంగా పై మార్పులు చేయడం యాజమాన్యాల ప్రయోజనం కోసమే.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్ 55, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలో షాపులకు సెక్షన్ 10, సంస్థలకు సెక్షన్ 17లను సవరించి 5 గంటల పని అనంతరం విరామం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని 6 గంటల పాటు పని చేసిన తర్వాత మాత్రమే విరామం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కార్మికుడి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. ఆరోగ్య సూత్రాల ప్రకారం ప్రతి 3 గంటలకోసారి అల్పాహారమో / పూర్తి ఆహారమో / తేనీయాలో తీసుకోవాలి. దాన్ని కూడా ఈ సవరణల ద్వారా నిరాకరించడం అమానుషం.ఫ్యాక్టరీల చట్టం సెక్షన్ 56లో భోజన విరామం, ముందుగా తెలియని / నిరోధించలేని ఏదైనా అత్యవసర పరిస్థితులలో కార్మికుని 8 గంటల పనిని 10.30 గంటల్లో విస్తరించవచ్చన్న నియమాన్ని సవరించి ఇప్పుడు 12 గంటలుగా మార్చారు. అంటే అంతకు ముందు అవాంతరాలతో కలిపి 2.30 గంటలుగా ఉన్న విరామం ఇప్పుడు 4 గంటలుగా మారుతుంది. అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలో షాపులకు సంబంధించి సెక్షన్ 11, సంస్థలకు సంబంధించి సెక్షన్ 18లో ఉన్న అన్ని విరామాలతో కలిపి 8 గంటల పనిని 12 గంటల్లో విస్తరించవచ్చన్న నియమం కొనసాగుతుంది. పని గంటలు పెరిగినా విరామాలతో కలపి 12 గంటలు మించవన్న లేబర్ కమిషనర్ వివరణ అంగీకరించరానిది. ఒకవైపు విరామాన్ని గంట పెంచడం మరియు 8 గంటల పని విస్తరణను మరో 2 గంటలు పెంచడం వలన కార్మికులు నష్టపోతారు. తమ కుటుంబాలతో గడపడానికో / ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాడానికో వినియోగించాల్సిన కాలాన్ని ఫ్యాక్టరీలో వెచ్చించాల్సి వస్తుంది. ఆ మేర కార్మికులకు మానసికంగా ఇబ్బంది కలుగుతుంది.గతంలో ప్రతి మూడు నెలలకు 50 నుండి 75 గంటలు అదనంగా కార్మికుని రాతపూర్వక అనుమతితో ఓటి చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓటి కాలాన్ని 144 గంటలకు పెంచారు. దీని వలన కార్మికునిపై పని భారం, పని ఒత్తిడి పెరుగుతాయి. కొత్త వారికి ఉపాధి తగ్గుతుంది. ఈ మేరకు యాజమాన్యాలు లాభపడ్డానికే ఈ ప్రతిపాదన తెచ్చారు.ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం మహిళా కార్మికులతో రాత్రి 7 గంటల తర్వాత, ఉదయం 6 గంటల్లోపు పని గంటల్లో నియమించకూడదు. అయితే ఈ సెక్షన్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని గతంలో చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు కొట్టేశాయి. మహిళలకు కూడా పని ప్రాథమిక హక్కుగా కల్పించాలనే ఉద్దేశంతో కోర్టులు మహిళలకు తగిన భద్రత, రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించి వారి అంగీకారంతో రాత్రి షిఫ్టుల్లో పని చేయించుకోవాలని తీర్పులిచ్చాయి. మహిళా సంఘాలు కూడా ఈ పని హక్కుకు మద్దతునిచ్చాయి. 2015, 2022లో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పుకు అనుగుణంగా యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పేర్కొంటూ సర్క్యులర్‌ను (25.10.2022న) జారీ చేశారు. ఆ నిబంధనల ప్రకారం మహిళా కార్మికులు రాతపూర్వకంగా అంగీకారం తెలపాలి. ప్రసూతి సెలవు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయించాలి. పనికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించాలి. పని ప్రదేశాల్లో టాయిలెట్లు, మంచినీరు, రక్షణ, తదితర సౌకర్యాలన్నీ కల్పించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. లైంగిక వేధింపుల చట్టం అమలు చేయాలి. కానీ చాలా ప్రదేశాల్లో ఇవేవీ అమలు కాని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణే లేదు. పెట్టుబడిదారులకు అనుకూలంగా నయా ఉదారవాద విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు వీటి పర్యవేక్షణకు తగిన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయని దుస్థితి నేడు నెలకొంది. ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు జరిగి కార్మికులు, ప్రజలు చనిపోతున్నా పట్టించుకోని పరిస్థితి మన కళ్ల ముందుంది. ఈ నేపథ్యంలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించి రాత్రిపూట పని చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా ఆ చరణలో దానికి తగ్గ ఏర్పాట్లు నేడు రాష్ట్రంలో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర క్యాబినెట్ ఈ సవరణ చేయడం దుర్మార్గం. పై నిబంధనలన్నింటి అమలు గ్యారంటీ చేశాకే, దానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయం సరైనది కాదు.పై సవరణలతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో లేబర్ కోడ్స్‌కు అనుగుణంగా పారిశ్రామిక వివాదాల పరిష్కారం కోసం కార్మికులు దరఖాస్తు చేసుకోవాల్సిన కాలాన్ని మూడు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించారు. మూడు సంవత్సరాల కాలం అయితే వివాదాలు పెరుగుతున్నాయని, ఇవి తగ్గడానికంటూ రెండు సంవత్సరాలకు కుదించింది. కార్మికులు సమ్మె చేయాలంటే అత్యవసర సర్వీసుల్లో 14 రోజుల ముందు నోటీసునివ్వాలి. దీన్ని అత్యవసరం కాని సేవల్లో కూడా ఈ 14 రోజుల నోటీసునివ్వాలని సవరణలు తెచ్చారు. జరిమానాలకు సంబంధించి యాజమాన్యాలు చిన్నపాటి జరిమానాలతో తప్పించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ చట్టం సవరించారు. చట్టాల ఉల్లంఘనపై యాజమాన్యాలపై కోర్టులకు వెళ్లకుండా, వారు ఇబ్బందులు పడకుండా అప్పటికప్పుడు చిన్నపాటి జరిమానాలు కట్టి తప్పించుకునేలా వెసులుబాటు కల్పించారు.కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఈ ప్రతిపాదనలు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం దుర్మార్గం. పూర్తిగా కార్మిక వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకునేలా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ మినహా కేంద్రంలో, మనతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక సవరణలు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. కర్ణాటకలో అంతకు ముందున్న బిజెపి ప్రభుత్వం వారపు పనిగంటలు 48 గానే ఉంచి, రోజువారీ పని గంటలను అవసరాన్ని బట్టి పెంచుకోవడమో లేదా తగ్గించుకోవడమో చేయవచ్చని చట్టాన్ని మార్చింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోంది. ఆ బాటలోనే నేడు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పయనిస్తోంది. కేంద్రంలో బిజెపి కార్మిక చట్టాల సవరణలతో తెచ్చిన లేబర్ కోడ్స్‌కు పార్లమెంట్‌లో తెలుగుదేశం, వైసిపి లు అమోదం తెలిపాయి. పార్లమెంట్‌లో వామపక్షాలు వ్యతిరేకించాయి. కార్మిక హక్కులను హరించడంలో మిగిలిన పార్టీల విధానం ఒక్కటే. దీన్ని కార్మికవర్గం గమనించాలి. వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. ఈ సవరణలను తిప్పి కొట్టాలి. జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను రాష్ట్రంలో జయప్రదం చేయాలి. జులై 9న పెద్ద ఎత్తున అన్ని మండలాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో వేలాదిగా నిరసనలు తెలపాలి.-వ్యాసకర్త : ఎ.వి. నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు
No comments:
Post a Comment