ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలకు అసలు పొంతనే లేదు. ఉదాహరణకు గత ప్రభుత్వం హయాంలో దిగువ స్థాయి పర్మినెంట్ ఉద్యోగుల బేసిక్ వేతనం రూ. 13,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 12,000 చెల్లించారు. ప్రతి నెలా రూ. 1,000 నష్టం చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వ హయంలో దిగువ స్థాయి పెర్మనెంట్ ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 20,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15,000 నిర్ణయించారు. అంటే నెలవారీ తేడా రూ. 5000కి పెరిగింది !
వై.యస్.ఆర్.సి.పి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం అనేకసార్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతగా ఉండగా అసెంబ్లీలో టి.డి.పి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ''ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి మోసగించిందని, మీరు చేయకపోతే మేము అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని'' అన్నారు. ''సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం'' చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళేది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులేనని, వారు సంతోషంగా ఉంటేనే ప్రజలలో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటుందని, అందువల్ల వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి కృషి చేస్తుందని అన్నారు. ప్రతి నెలా మూడవ శుక్రవారం ముఖ్యమంత్రి నుండి దిగువ స్థాయి అధికారులు అందరూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేటాయించా లని ఆదేశించారు. రెండున్నరేళ్ళలో ఒకే ఒక్క రోజు దిగువ స్థాయి అధికారులు ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. ఆ తరువాత వీరి గురించి పట్టించుకున్న నాధుడు లేడు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పి.ఆర్.సి జీవోలతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుదల చేస్తూ జీవో. నెం.7ను జారీ చేసింది. దీని ప్రకారం గతంలో రూ.12,000, రూ.15,000, రూ.17,500 జీతాలు పొందుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15,000, రూ.18,500, రూ.21,500 గా పెంచింది. దీనితో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఆర్థిక లబ్ధి చేకూరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, దీనికి అనుకూలంగా ఉన్న మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది.
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలకు అసలు పొంతనే లేదు. ఉదాహరణకు గత ప్రభుత్వం హయాంలో దిగువ స్థాయి పర్మినెంట్ ఉద్యోగుల బేసిక్ వేతనం రూ. 13,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 12,000 చెల్లించారు. ప్రతి నెలా రూ. 1,000 నష్టం చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వ హయంలో దిగువ స్థాయి పెర్మనెంట్ ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 20,000 కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15,000 నిర్ణయించారు. అంటే నెలవారీ తేడా రూ. 5000కి పెరిగింది!
పెర్మనెంట్ ఏ.ఎన్.ఎం లకు గత ప్రభుత్వ హయాంలో బేసిక్ వేతనం రూ. 21,230 కాగా, ఔట్‌సోర్సింగ్ ఏ.ఎన్.ఎం లకు రూ. 15,000 చెల్లించారు. నెలవారీ తేడా రూ. 6,230. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెర్మనెంట్ ఏ.ఎన్.ఎం లకు బేసిక్ వేతనం రూ. 32,670 కాగా, ఔట్‌సోర్సింగ్ ఏ.ఎన్.ఎం.లకు రూ.18,500 నిర్ణయించారు. నెలవారీ తేడా ఏకంగా రూ. 14,170!
పెర్మనెంట్ స్టాఫ్ నర్స్‌లకు గత ప్రభుత్వ హయాంలో బేసిక్ వేతనం రూ. 25,140 కాగా, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ నర్స్‌లకు రూ. 17,500 చెల్లించారు. నెలవారీ తేడా రూ. 7,640. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో స్టాఫ్‌నర్స్‌ల బేసిక్ వేతనం రూ. 38,720 కాగా, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌నర్స్‌లకు రూ. 21,500 నిర్ణయించారు. నెలవారీ తేడా రూ. 17,220 వాటిల్లుతోంది. ఆ విధంగా ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం అన్ని క్యాడర్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా భారీ ఎత్తున నష్టం పెరిగింది. కాగా ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో ''భారీ లబ్ధి'' చేకూరినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నది.
గత 20 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళకొకసారి పి.ఆర్.సి ప్రకారం జీతాలు పెరిగిన అనంతరమే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా జీతాలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పి.ఆర్.సి కాలాన్ని పదేళ్ళకు పెంచింది. అంటే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ జీతాల పెంపుదల కోసం మరో పదేళ్ళు ఎదురు చూడాలన్నమాట. ఇది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సైతం మరింతగా నష్టం కలిగించే విషయం.
రాష్ట్ర సచివాలయం లోనూ, హైకోర్టు లోనూ, సి.ఆర్.డి.ఏలోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలోనూ, ఇతర అనేక చోట్ల పని చేసే వారికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జి.ఓ ప్రకారం జీతాలు కూడా చెల్లించడం లేదు. వర్క్ ఔట్‌సోర్సింగ్ విధానంతో వీరు మరింతగా నష్టపోతున్నారు. వీరికి కేవలం 7 నుండి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది మరీ అన్యాయమైన దోపిడీ.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వాస్తవాలను మరుగుపరచి ఉద్యోగులను, ప్రజలను తప్పుదారి పట్టించే దుర్మార్గమైన ప్రచారాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 11వ పి.ఆర్.సి ప్రకారం పెర్మనెంటు ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలి. వర్క్ ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేసి వారందరికీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవో ప్రకారం జీతభత్యాలు ఇవ్వాలి. రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఐక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని జెఏసి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ పిలుపునిస్తున్నది.
/ వ్యాసకర్త : ఛైర్మన్ జెఏసి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్,
టీచర్స్ అండ్ వర్కర్స్, గుంటూరు జిల్లా /
వై. నేతాజి
No comments:
Post a Comment